Day-2 తెలుగు చలన చిత్రాలలో రామాయణ పరిచయం

రామాయణ కథకు సంభందించిన సినిమా పాటలు ప్రస్తావించు కుంటే, భూకైలాస్ గురించి తలుచుకోవలసిందే.

‘రాముని అవతారం ‘ పాట గురించి కూడా రెండు ముక్కలు చెప్పుకుందాం అనిపించింది. అంతలోనే గత సంవత్సరం నా మిత్రులోకరు share చేసిన పోస్ట్ ఒకటి గుర్తుకు వచ్చింది. వెదికి చూస్తే దొరికింది కూడా.

ఎవరో మహానుభావులు చేసిన పోస్ట్, plagiarize చెయ్యకుండా యధాతథంగా ఫార్వర్డ్ చేస్తున్నా.

P.S. భూకైలాస్ కూడా Amazon prime లో ఉంది.

**
Forwarded…..
Quote

చిత్రం : భూకైలాస్(20-03-1958)
సంగీతం : ఆర్. సుదర్శన్, ఆర్. గోవర్ధన్
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం : ఘంటసాల

రామ కథ సామాన్య ప్రజకి మరింత చేరువ చేసిన కవి త్రయం సముద్రాల రాఘవాచార్యులు (19-07-1902 & 16-03-1968) , మల్లాది రామకృష్ణ శాస్త్రి (16-06-1905 & 12-09-1965) , దేవులపల్లి కృష్ణ శాస్త్రి (01-11-1897 & 24-02-1980).

విశేషమేమిటంటే శ్రీ రాముడు పునర్వసు నక్షత్రంలో పుట్టాడు. ఇది నక్షత్ర క్రమంలో ఏడవది. శ్రీ రాముడు కూడా మహా విష్ణువెత్తిన ఏడవ అవతారం. పునర్వసు పేరు సూచిస్తున్నట్టే రాముడు కూడా ‘పునర్వాసం’ ఏర్పరచుకున్నాడు. ‘భూ కైలాస్, 1958’ చిత్రంలో సముద్రాల వారు నారద పరంగా చెప్పిన ‘రాముని అవతారం రఘుకుల సోముని అవతారం’ అనే భవిష్య వాణిలో మనకు వినిపించేవి కూడా ఏడు చరణ ధ్వనులే.

మొత్తం రామాయణాన్ని ఆరు నిమిషాల్లో ఎంత అందం గా చెప్పాడో కదా మహానుభావుడు.

కొంచం ప్రశాంతంగా భూ కైలాస్ సినిమా లోని “రాముని అవతారం” పాట వింటే , నిజంగా సముద్రాల గారు ఎన్ని సార్లు రామ దర్శనం చేస్తే ఈ పాట రాయ గలిగారో కదా అని అనిపించక మానదు.

పార్వతి మాత శివ సాన్నిహిత్యానికి దూరం కావడం “విష్ణు” మాయ ప్రభావమే అని నారదుడు చెప్పగా “తనకు” కలిగిన కష్టం ఆ నారాయణుడికి కూడా కలగాలి అని శాప వచనం ఇచ్చిన సందర్భంలో, ఇదే ఒక మహత్తర లోక కళ్యాణంకు మార్గం అవుతుంది అని నారదుని భక్తా వేశం రామావతార గేయ రూపకంగా తీర్చి దిద్ద పడుతుంది

ఎవరైనా ఈ పాటని కుశాగ్రంగా వింటే అస్సలు ప్రారంభ వాక్యం దగ్గరే చాల సేపు ఆగిపోక తప్పదు. “రాముని అవతారం రవి కుల సోముని అవతారం” అంటే సూర్య వంశానికి చంద్రుని వలే ప్రకాశిస్తాడు అని అర్ధం ఇస్తూ “శ్రీ రామ చంద్రుడు” నామాన్ని సార్ధకం చేస్తారు కవి.

“దాశరధి గా శ్రీ కాంతుడు వెలయు
కౌసల్యాసతి సతి తపము ఫలించు
జన్మింతురు సహా జాతులు మువ్వురు”

ఎన్ని విషయాలు ఈ మూడు ముక్కల్లొ. లక్ష్మీపతి కౌసల్యా దేవి తపం ఫలించే విధంగా దశరధుని కుమారుడుగా జన్మించడం మరియు తన అంశ తోనే మరో ముగ్గురి కుమారులుగా ఆవిర్భవించడం. చాల మందికి లక్ష్మణుడు “వాసుకి” అంశ అని, “భరతుడు” సుదర్శనం” యొక్క అంశ అని, “శత్రుఘ్నుడు ” శంఖం యొక్క అంశ అని భావన ఉంటుంది. “సహజాతులు” అన్న ప్రయోగం ఎంత నేర్పుగా బహు ప్రయోజనాలకి వాడడం చూస్తే భాష మీద వాళ్లకి ఉన్న పట్టు ఆశ్చర్యం కలించక మానదు.

“చదువులు నేరుచు మిష చేత
చాపం దాలిచి చేత
విశ్వామిత్రుని వెను వెంట
యాగం కావగ చనునంట”

“వెనువెంట”, “చనునంట” ఇట్లాంటి పద ప్రయోగం ఇవ్వాళ , రేపు కన పడ్డం చాల అరుదు. ఒక్క చిన్న విషయం చెప్పడానికి చాట భరతం చెప్పడం చూస్తున్నాము, మరి ఇంత గహనమైన విషయం ఇంత పొదుపుగా చెప్పడం చూస్తే మనం ఎంత అయినా నేర్చుకోవాలేమో.

ధనువో, జనకుని మనమున భయమో, ధారుణి కన్యా సంశయమో… దనుజులు కలగను సుఖ గోపురమో, విరిగెను మిథిలా నగరమున…’ ఆహా, ఎన్ని విరిగినవి, మిథిలా నగరంలో?

“అదిగో చూడుము బంగరు జింక
మన్నై చనునయ్యో లంక
హరనయనాగ్ని పరాంగన వంక
అడిగిన మరణమే నీ కింక “

కధ అంతా బాగానే వెళుతోంది అనుకొంటుండగా మలుపు. ఆ మలుపు కి తగ్గట్టుగా పాట. అప్పటి వరుకు ఉన్న బాణీ నించి ఒక కొత్త పంథా కనపడుతుంది. రాబోతున్న లంకా ప్రయాణం, పరాంగన వంక దృష్టి మరణానికి హేతువు అవుతోందని భవిష్య వాణి వినపడుతుంది ఈ చరణంలొ.

“రమ్ము రమ్ము హే భాగవతోత్తమ
వానర కుల పుంగవ హనుమా
ముద్రిక కాదిది భువన నిదానం
జీవన్ముక్తికి సోపానం”

రామాయణం లో ఎక్కడ హనుమ ప్రస్తావన ఉంటుందో అక్కడ మంగళం ఉండక తప్పదు. ఈ పాట లో కూడా “హనుమ” ప్రవేశం అంత మంగళం గాను ఉంటుంది. ఒక యోగిపుంగవుడు ఆత్మ ఆవిష్కారం కోసం ప్రయత్నించే ఘట్టం “జీవన్ముక్తి” సోపానం కాక మరి ఇంక ఏమి అవుతుంది. “సుందర” కాండ పారాయణ మోక్షదాయకం కదా.

“రామరామ జయ రామ రామ
జయ రామరామ రఘుకుల సోమా
సీతాశోక వినాశనకారి
లంకా వైభవ సంహారి”

రామ నామ వైభవం, హనుమ విజయం, రావణ సంహారం, భక్త జన శోక వినాశనం. ఇలా అన్నీ తాత్పర్యాలు ఈ “సముద్రాల” వారి లఘు రామాయణం లో ప్రతిబింబిస్తాయి. ఇంతటి చక్కటి రామ కావ్య పద్యాన్ని తెలుగు జాతి అందించి అయన చరితకి కూడా అమరత్వాన్ని ఆపాదించు కొన్నారు అంటే అతిశయోక్తి కాదేమో.

రాముడిని కొలిచి, తలిచి తరించిన వాళ్ళు ఎందరో. రాముడిని కొలిస్తే “రాముడి” లా మాట్లాడగలుగుతారు అట. “రాముడి” లా ప్రవర్తన ఉంటుంది అట. “రాముడిని కొలిస్తే రాముడి లా అవుతారు అట”. ఈ పాట రాయ గలిగారు అంటే ఎంత సాధన చేయ గలిగారో కదా .

సాకీ : ద్వారపాలుర మరల దరిదీయు కృపయో
ధరలోన ధర్మము నెలకొల్పు నెపమో… ఓ
రాముని అవతారం… .రవికుల సోముని అవతారం

పల్లవి: రాముని అవతారం… రవికుల సోముని అవతారం
సుజన జనావన ధర్మాకారం
దుర్జన హృదయ విదారం
రాముని అవతారం…

  1. దాశరధిగ శ్రీకాంతుడు వెలయు
    కౌసల్యాసతి తఫము ఫలించు
    జన్మింతురు సహజాతులు మువ్వురు
    జన్మింతురు సహజాతులు మువ్వురు
    లక్ష్మణ శత్రుఘ్న భరతా…
    రాముని అవతారం… రవికుల సోముని అవతారం
  2. చదువులు నేరుచు మిషచేత
    చాపము దాలిచి చేత…
    విశ్వామిత్రుని వెనువెంట
    యాగము కావగ చనునంట
    అంతము చేయునహల్యకు శాపము
    అంతము చేయునహల్యకు శాపము
    ఒసగును సుందర రూపం
    రాముని అవతారం… రవికుల సోముని అవతారం
  3. ధనువో జనకుని మనసున భయమో
    ధారుణి కన్యా సంశయమో
    దనుజులు కలగను సుఖగోపురమో
    దనుజులు కలగను సుఖగోపురమో
    విరిగెను మిధిలా నగరమున
    రాముని అవతారం… రవికుల సోముని అవతారం
  4. కపట నాటకుని పట్టాభిషేకం
    కలుగును తాత్కాలికా శోకం
    భీకర కానన వాసారంభం
    లోకోద్ధరణకు ప్రారంభం.
    భరతుని కోరిక తీరుచు కోసం
    పాదుక లొసగే ప్రేమావేశం
    భరతుని కోరిక తీరుచు కోసం
    పాదుక లొసగే ప్రేమావేశం
    నరజాతికి నవ నవసంతోషం
    గురుజన సేవకు ఆదేశం
    రాముని అవతారం… రవికుల సోముని అవతారం
  5. అదిగో చూడుము బంగరు జింక
    మన్నై చనునయ్యో లంక
    హరనయనాగ్ని పరాంగనవంక
    అడిగిన మరణమె నీ జింక
  6. రమ్ము రమ్ము హే భాగవతోత్తమ
    వానర కుల పుంగవ హనుమాన్…
    రమ్ము రమ్ము హే భాగవతోత్తమ
    వానర కుల పుంగవ హనుమాన్
    ముద్రిక కాదిది భువన నిదానం
    ముద్రిక కాదిది భువన నిదానం
    జీవన్ముక్తికి సోపానం…
    జీవన్ముక్తికి సోపానం
  7. రామరామ జయ రామ రామ
    జయ రామరామ రఘుకుల సోమా
    సీతాశోక వినాశనకారి
    లంకా వైభవ సంహారి
    అయ్యో రావణ భక్తాగ్రేసర
    అమరంబౌనిక నీ చరిత
    సమయును పరసతిపై మమకారం
    వెలయును ధర్మ విచారం

రాముని అవతారం… రవికుల సోముని అవతారం
రాముని అవతారం… రవికుల సోముని అవతారం.

Unquote

రాముని అవతారం (భూకైలాస్)