ఆకాశవాణి సంస్కృత పాఠం సిగ్నేచర్ ట్యూన్

ఆకాశవాణి (AIR) సంస్కృత పాఠం సిగ్నేచర్ ట్యూన్

డెబ్భై ఎనభై లలో రేడియో విన్నవారికి ఆకాశవాణి (AIR) సంస్కృత పాఠం థీమ్ పాట సుపరిచితం. ఇది భర్తృహరి నీతి శతకం లోనిది అని కూడా చాలామందికి తెలిసే ఉంటుంది.

నీతి బోధించడానికి కూడా (మూర్ఖ పద్ధతి, అర్ధ పద్ధతి, దుర్జన పద్ధతి etc. అని) శాస్త్రీయంగా గా వర్గీకరించిన చేసిన మహాకవి భర్తృహరి.

పై పద్యం విద్వత్ పద్ధతి కి సంబంధించినది.
అన్వేషణ (explore) చెయ్యాలంటే ఎంతో ఉంది.

శ్లోకం:

केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वला
न स्रानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः I
वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते
क्षीयन्तेखिल भूषणानि सततं वाग्भूषणं भूषणम् II भर्तृहरि नीतिशतकम् ।

కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చన్ద్రోజ్జ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం నాలఙ్కృతా మూర్ధజాః ।
వాణ్యేకా సమలఙ్కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయన్తేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్ ॥

పై శ్లోకములోని నాలుగవ పాదానికి పాఠాంతరం:

క్షీయన్తే ఖలు భూషణాని, సతతం, వాగ్భూషణం భూషణం

సంధి విగ్రహం :

కేయూరాణి, న భూషయన్తి, పురుషం, హారాః, న, చన్ద్రోజ్జ్వలాః,
న స్నానం, న విలేపనం, న కుసుమం, నాలఙ్కృతాః, మూర్ధజాః,
వాణీ, ఏకా, సమలఙ్కరోతి, పురుషం, యా సంస్కృతా, ధార్యతే,
క్షీయన్తే, అఖిల భూషణాని, సతతం, వాగ్భూషణం, భూషణమ్.

శబ్దార్థం:

కేయూరాణి = భుజ కీర్తులు లేదా దండ కడియాలు,
న భూషయన్తి = అలంకరింపవు,
పురుషం = పురుషుని,
హారాః = ముత్యాల హారములు,
న = న భూషయంతి = అలంకరింప బడవు,
చన్ద్రోజ్జ్వలాః = చంద్రును వలె ప్రకాశించునటువంటి,
న స్నానం = పన్నీటి జలకాలు అలంకరింపవు,
న విలేపనం = పచ్చ కర్పూరము, కస్తూరి, కుంకుమ పువ్వు, మంచి గంధము మొదలగు సుగంధ ద్రవ్యాల సువాసనలతో కూడిన మైపూత అలంకరింపవు,
న కుసుమం = పూవులు ధరించుట అలంకరింపదు, నాలఙ్కృతాః = అలంకరణలని ఈయజాలదు,
మూర్ధజాః = వివిధ రకాల కేశాలంకరణలు,

వాణీ = ఏ వాక్కు, (సా = ఆ వాణి)
ఏకా = ఒక్కటియే, సమలఙ్కరోతి = సరిగా అలంకరించునది,
పురుషం = పురుషుని,
యా సంస్కృతా = వ్యాకరణాది శాస్త్రములచే సంస్కరింప బడినటువంటి,
ధార్యతే = ధరింపబడుచున్నదో,
క్షీయన్తే = కాలక్రమేణా నశించును,
అఖిల భూషణాని = మిగిలిన అఖిలములైన భూషణాలు, సతతం = ఎల్లప్పుడూ, వాగ్భూషణం = వాక్కు అనే ఆభరణము,
భూషణమ్ = నిజమైన ఆభరణము.
ఖలు = కదా!
భావార్థం:

వాక్కు అనగా విద్య. ఆ వాక్కు యొక్క ప్రాముఖ్యాన్ని, దాని విలువని ప్రస్ఫుటముగా తెలియజెప్పే భర్తృహరి నీతిశతకములోని చక్కటి సుభాషితము.

భుజ కీర్తులు గానీ దండ కడియాల వంటి అలంకరణలు పురుషుని అలంకరింపవు.

చంద్రుని కాంతివలె ఉజ్జ్వలముగా ప్రకాశించునటువంటి ముత్యాల హారములు, చంద్రహారములు సూర్య హారములు వంటి హారములు గానీ పురుషుని అలంకరింపవు. పన్నీటి జలకాలు, సుగంధ ద్రవ్యాల సువాసనలతో కూడిన శరీర లేపనములు మైపూతలు పురుషుని అలంకరింపవు. పూల ధారణలు, వివిధ రకాల కేశాలంకరణల పురుషునికి నిజమైన అలంకరణలు కాజాలవు.

వ్యాకరణాది శాస్త్రములచేత సంస్కరింపబడినటువంటి ఏ వాక్కు అయితే పురుషునిచే ధరింపబడుచున్నదో ఆ ఒక్క వాక్కు మాత్రమే పురుషునికి సరియైన అలంకార ప్రాయమగు భూషణము. తక్కిన సువర్ణమయాదిభూషణములన్నియును క్రమేణ క్షీణించును. ఎల్లప్పుడును ధరింపబడియున్నట్టి వాక్భూషణమే నశించనటువంటి నిజమైన భూషణము.

భర్తృహరి యొక్క సుభాషితములలోని నీతి శతకములో వాక్కు యొక్క ప్రాసస్థ్యాన్ని తెలియపరచే తలమానికమైనట్టి ఈ సుభాషితమునకు, ఏనుగు లక్ష్మణ కవి యొక్క అంతటి ధీటైన తెలుగు సేత ఈ క్రింది పద్యము.

ఉ.
భూషలుగావు మర్త్యులకు భూరిమయాంగద
తారహారముల్,
భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్
భూషలుగావు,
పూరుషుని భూషితుజేయు పవిత్ర వాణి, వాగ్భూషణమే సుభూషణము, భూషణముల్ నశియించునన్నియున్.