గాలిబ్ గీతాలు

శోకం నుంచి శ్లోకం పుట్టింది అన్నది నానుడి అయితే, విరహానికి గాలిబ్‌ గీతం పుట్టిల్లు. ఉర్దూలో ‘ఘజల్’ సంభాషణాత్మకమైన కవితా శైలి. “ఘజల్” ని తెలుగువారికి పరిచయం చేసిన ఘనత దాశరధి కృష్ణమాచార్య గారికే దక్కింది. దాశరథి 1961 లో “గాలిబ్ గీతాలు” పేరుతొ (మిర్జా అసదుల్లా ఖాన్) గాలిబ్ గారి ఉర్దూ గజళ్లకు తెలుగు అనువాదం ప్రచురించారు. ఎంతో కొంత భావుకతకు లోనై కవిత్వం రాద్దామనుకున్న యువతీ యువకులకు “గాలిబ్ గీతాలు” ఒక ప్రేమబాలశిక్ష అనడం లో ఏమాత్రం సందేహం లేదు.

హైదరాబాద్ లో రసజ్ఞులైన యువ డ్రైవర్లు ఆటో రిక్షా వెనుకనో, ట్రక్ పైనో రాసుకునే గాలిబ్ కవితలు అంత ట్రాఫిక్ లోనూ ఆహ్లాదాన్ని కలిగిస్తూనే ఉంటాయి.

చెప్పుకోవడానికి దాశరధి గారి అనువాద గజల్ గీతాలు 400 పై చిలుకు ఉన్నప్పటికీ, ఈ శీర్షికలో కవిత్వంలో మురిపెం, కోపం, విరహం, శృంగారం, అసహనం మొదలైన భావాలు ప్రకటించడం కోసం “గోరు” ప్రధానాంశం గా గాలిబ్ ఎంత బాగా వాడుకున్నారో, దాశరధిగారు ఎంత సుభోదకంగా, సరళంగా అనువదించారో మచ్చు కి కొన్ని కవితలు చూద్దాం.

ఈ పుస్తకం తో మీకు ముందే పరిచయం ఉంటే, మళ్ళీ మీ జ్ఞాపకాలని పునః ప్రేరేపించడానికి, లేకుంటే ఈ పుస్తకం చదవాలని ఆసక్తి రేపాలని ఒక ప్రయత్నం.

  1. వచ్చె నరుణ తరుణ వసంత సమయమ్ము
    గోళ్ళు మరల గుండె గోక జొచ్చె.

మూలం:
ఫిర్ జిగర్ ఖోద్నే లగా నాఖూన్
ఆమదే ఫస్లే లాలకారి హై
[Onset of harvest of tulips]

  1. గ్రంధి [చిక్కు] పడని నాడు కలవయ్యె నఖములు
    గ్రంధి పడెనె నేడు కలదె నఖము?
  2. ఎంతకని వ్రాతు నా గుండెవంత? నింక
    ఆమెకే చూపెదను రక్తి లాంగుళులను.
  3. నా యెడద చీల్చి రక్త మండలము చేసె
    నేను వేదనతో మరణించి నాడ
    ఇపుడు గోళ్లకు నెరుపురం గెట్టులెక్కు
    వెలది తాను గోరింటాకు పెట్టుకున్న.
  4. ఇంత భ్రమపడి రంగద్దె దేల గోళ్ళ
    రంగధికమైన యెడల జ్వాలలను రేపు.
  5. ప్రణయినీ రాగ రంజిత పదయుగమ్ము
    ముద్దుగొను కోర్కె తీరక పోయె గనుక
    ప్రియ సమాధి సమీప ధరిత్రి నిండ
    చిక్క చిక్కగా మైదాకు [గోరింట] చెట్లు పెరిగె.
  6. నాశమందు కూడ నవ సౌఖ్య మున్నది
    నఖము కత్తి రింప సుఖము కలుగు.
  7. తరుణి, నీదు రమ్యాంగుళి మరతు నేని
    వ్రేలి నుండి గోరూడిన రీతి బాధ!