18. హరిణాపి హరేణాపి

హరిణాపి హరేణాపి
బ్రహ్మణాపి సురైరపి ।
లలాటలిఖితా రేఖా
పరిమాష్టుం న శక్యతే ॥

hariṇāpi hareṇāpi
brahmaṇāpi surairapi ।
lalāṭalikhitā rekhā
parimāṣṭuṃ na śakyate ॥

లలాటలిఖితా రేఖా (lalāṭalikhitā rekhā) = నుదుటిపై వ్రాసిన వ్రాత
పరిమాష్టుం న శక్యతే (parimāṣṭuṃ na śakyate) = తుడిపివేయడం సాధ్యం కాదు
హరిణా అపి (hariṇā api) = విష్ణువు ద్వారా అయినా
హరేణా అపి (hareṇā api) = శివుని ద్వారా అయినా
బ్రహ్మణా అపి (brahmaṇā api) = బ్రహ్మా ద్వారా అయినా
సురైః అపి(suraiḥ api)= ఇతర దేవతల ద్వారా కూడా

సూచన: తృతీయా విభక్తి (tṛtīyā vibhakti) (Instrumental Case)

అర్థం: నుదుటిపై వ్రాసిన వ్రాతను విష్ణువు, శివుడు, బ్రహ్మ లేదా ఏ ఇతర దేవతలూ తుడిపివేయలేరు.

సందర్భం: ఒకని విధి అతని నుదిటిపై (లేదా అతని అరచేతి రేఖలలో) వ్రాయబడిందని సనాతనీయులు నమ్ముతారు. అయితే, విధి అనే పదం చాలా తప్పుగా అర్థం చేసుకున్న (వాడబడుతున్న) పదాలలో ఒకటి. వైదిక సంస్కృతిలో, మన జీవితంలో ప్రతిదీ ముందుగా నిర్ణయించబడిందని మనము విశ్వసించము అని అర్థం చేసుకోవాలి. కానీ మన జీవితం విధిచేత ‘పాలించబడుతుందని’ మనము నమ్ముతున్నాము. ఇది విరుద్ధంగా కనిపించవచ్చు కానీ వేద సందర్భంలో విధి యొక్క అర్ధాన్ని ఒకసారి తెలుసుకుందాం. విధి అనేది డైనమిక్ ఎంటిటీ (dynamic entity). వివరంగా చెప్పాలంటే, నేను ప్రస్తుతం ఎదుర్కొనేది గత చర్యల ఫలితం మరియు భవిష్యత్తులో నేను ఎదుర్కొనేది నా ప్రస్తుత చర్యలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, ప్రతి క్షణం, నేను నా భవిష్యత్తును సృష్టించుకుంటున్నాను. మరో మాటలో చెప్పాలంటే, నా వర్తమానం నా గతం యొక్క ఫలితం మరియు నా భవిష్యత్తు వర్తమానంలో (ప్రస్తుత చర్యల ద్వారా) సవరించబడిన గతం యొక్క ఫలితం. అందువలన వైదిక సంస్కృతిలో ప్రస్తుత చర్యలకు (ప్రస్తుత జీవితంలో) పురుష ప్రయత్నానికి (స్వీయ ప్రయత్నం) కీలక మైన స్థానం ఉంది. స్వీయ-ప్రయత్నం యొక్క ప్రాముఖ్యత అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఏర్పడే నిర్లిప్తత మనిషిని సోమరిగా తయారు చేయ్యడమే కాక, మనిషికీ సమాజానికీ విపరీత పరిణామాలకు దారి తీస్తుంది.

కాబట్టి, ఇప్పుడు తదుపరి ప్రశ్న ఏమిటంటే, మన విధిని మార్చగల సామర్థ్యం దేవునికి ఉందా అంటే ఖచ్చితంగా ఉంది.

భగవంతుడు సర్వశక్తిమంతుడు మరియు సర్వవ్యాపి. అతని అనుగ్రహం సూర్యుని కాంతి వలె ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. కాబట్టి, విధి గత చర్యల ద్వారా సృష్టించబడితే బుద్ధి మన ప్రస్తుత చర్యలకు కారణమవుతుంది. భగవంతుని దయ వల్లనే మన ప్రస్తుత చర్యల ద్వారా మన స్వీయ భవిష్యత్తును సరిదిద్దుకోవడానికి అవకాశం కలుగుతుంది. వైదిక సంస్కృతిలోని కర్మ-జన్మ సిద్ధాంతాల వంటి ఇతర ముఖ్యమైన భావనల గురించి లోతైన అవగాహన కలిగినప్పుడే విధి గురించి కూడా సరియైన అవగాహన కలుగుతుంది.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: భక్తిఫోటోస్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం