Day-3 తెలుగు చలన చిత్రాల్లో రామాయణ కథలు

సముద్రాల రాఘవాచార్య గారు మొదలుకొని (రాముని అవతారం – భూకైలస్ 1958) రామజోగయ్య శాస్త్రి (రామ రామ – శ్రీమంతుడు) 2015) వరకు సినీ కవులు రామకథను తెలుగు వాళ్లకు అందిస్తూనే ఉన్నారు. అలాగే అంతకు ముందు, ఆ తర్వాత – కథకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, దర్శకులు, నటీ నటులు, గాయనీ గాయకులు, వేరే కళాకారులు – ఎందరో మహానుభావులు.

వీరిలో రోజుకి ఒక్కరి గురించి తలచుకున్నా, రామనవమి వచ్చేస్తుంది. అయితే, ఇందులో ప్రత్యేకంగా మనం ప్రస్తావించుకోవలసినది, బాపూ గారిని. ఈయన అందరికీ ఇష్టుడే. ఈయనకు మాత్రం రాముడంటే ఇష్టం అని చెప్పుకోడానికి బోలెడు తార్కాణాలు.

ఎంత ఇష్టం కాకపోతే, ఆయన తీసిన షుమారు యాభై సినిమాల లో ఏడెనిమిది పైచిలుకు సినిమాలు రామకథ కి సంభందించినవే.

సంపూర్ణ రామాయణం (1971) బాపూ గారి మొదటి రామాయణ చిత్రం.

అందాలరాముడు (1973) లో బాపూ భద్రాచల స్థల పురాణం తెలుగు ప్రజలకు మరోసారి గుర్తు చేశారు.

సంపూర్ణ రామాయణం తో రామకథ దృశ్య కావ్యం గా మలచిన తృప్తి కలగలేదు కాబోలు, మొదట్లో సీతా కల్యాణం (1976) silent movie గా తీద్దామని అనుకున్నారు – ట!

బాపూ గారి రామభక్తి కి మచ్చుతునక ముత్యాల ముగ్గు (1975) సినిమా లో మనందరికీ, మనతో పాటు సినిమాలో K. శాంత (4th Class Section- B) కీ మాత్రమే కనిపించే ఆంజనేయులు.

బాపూ గారి చివరి సినిమా కూడా శ్రీ రామ రాజ్యం(2011) అవ్వడం విశేషం.

ఇవి కాక బాపూ బొమ్మలతో చెప్పిన రామాయణాలు ఎన్నో లెక్కే లేదు. ఒకానొక చోట బాపుగారు ఆయన బొమ్మే హనుమంతుడి లా చిత్రించుకున్నారు.

*

సంపూర్ణ రామాయణం ఇప్పుడు ఎవరైనాచూస్తే చాల క్లుప్తంగా చెప్పినట్టు అనిపించవచ్చు. దీనికి కారణం చిత్రం లో ప్రతీ frame, సరిగ్గా మనకు ఇంతకు ముందు బొమ్మల రామాయణం లోనో, చందమామ, బాలమిత్ర పుస్తకాలలో చూసినట్టే ఉండడం. కొన్ని dramatize చేసిన సన్నివేశాలు రామాయణ ప్రియులకు నచ్చకపోయినా పోవచ్చు కూడా.

**

వెనకటికి నా మిత్రుడు ఒకడిని సంపూర్ణ రామాయణం సినిమా చూసి వచ్చాక, “ఎలా ఉందిరా, సినిమా” అని మా అమ్మ అడిగితే, “Absurd గా ఉంది పిన్నిగారూ”, అన్నాడు. “అదేంటి రా”, అన్న మా అమ్మ ప్రశ్నకు సమాధానంగా “అంత పెద్ద ఎస్వీఆర్ గారు అంత చిన్న చంద్రకళ (సీత) కోసం అనవసరంగా రిస్క్ చేసినట్టుంది” అన్నాడు తనదైన style లో ఎస్వీఆర్ గారి action ని మెచ్చుకుంటూ. “అదే కాదురా మరి నీతి!”, అని మా అమ్మ అంటే, అప్పుడు ఎంత అర్థం చేసుకుని ఉంటానో గానీ, ఇప్పుడు అనిపిస్తోంది అవును కదా, అని.

*

ఈ చిత్రo లో, బాపూ బొమ్మలు, చిట్టిబాబు వీణ బాపూ గారు చక్కగా వాడుకున్నారు.

కె వి మహదేవన్ సంగీతానికి దీటుగా దేవులపల్లి, ఆరుద్ర, దాశరథి, కొసరాజు, సి నారాయణ రెడ్డి పాటలు రాశారు.

ముఖ్యంగా దేవులపల్లి గారి “ఊరికే కొలను నీరు”, శబరి ని, కొసరాజు గారి “రామయ తండ్రి” గుహుడి ని తెలుగు సినిమా ప్రేక్షకులకు అమరులను చేశాయి.

కరుణశ్రీ “యశోధర విలాపం” గుర్తు చేసేలా “అసలే ఆనదు చూపు, ఆపై ఈ కన్నీరు, తీరా దయచేసిన నీ రూపు తోచదయ్యయ్యో.” శబరి దుస్థితి ఎంత చక్కగా చెప్పారు? బాపూ గారు ఆయన signature style లో రాముడికి శబరి కొరికి ఇచ్చిన పండ్లు పక్కన (లేని) సీతకు ఇయ్యబోయినట్టు చూపించారు.

ఇక పోతే, “రమాలాలి” పాట సరిగ్గా వింటే, అందులో సినారే గారు ఎంత చక్కటి చమత్కారాలు గుప్పించరో, బాపూ గారి కోసం అన్నట్టు.

“నిద్దరనైనా పెదవుల నవ్వుల ముద్దరలుండాలి. ఊగే జోలకు సరిగా ముంగురు లూగు చుండాలి.”
“నేనా, నేనో, నేనే”, “అందగాడనా నీకన్నా ? అందరాడనా ఒకన్నా!”
ఒక్క పాటలో ఎన్ని చమత్కారాలు!

*

పురాణాలకు అదే ప్రత్యేకం. శోధించిన కొద్దీ కొత్త కోణం స్పురిస్తునే ఉంటుంది. అందుకే మళ్ళీ మళ్లీ చెప్పుకోవాలని అనిపిస్తుంది.