Day-6 రాముడు నడిచిన నేలలో ….

క్రింద వ్రాసినది నా స్నేహితుని చిన్ననాటి స్నేహితులలో ఒకరు. Cannot keep it to myself.

ఎందరో దేవుళ్ళు భావన నాకు చాలా నచ్చింది.

కైకేయి అందరికీ విలన్ గానే తెలుసు. దశరథుడు చనిపోయి, కొడుకు, లోకం తో వెలివేయబడి తనుపడ్డ మానసిక క్షోభను సంపూర్ణ రామాయణం లో బాపూ గారు మనకు కొంత పరిచయం చేశారు.

కానీ కైకేయి ని కారణ జన్మురాలిగా చూడగల్గిన వాళ్లు నిజంగా ధన్యులు.

“రామ బంటు హనుమంతుడు సిద్ధం” అంటూ భావోద్వేగ ముగింపు తో కూడా టచ్ చేశాడు.

QUOTE

రాముడు నడిచిన నేలలో ….

పార్వతీపురం బ్రాంచ్ హై స్కూల్ లో ఆరోతరగతి చదువుతున్నాను. కొద్దిమంది ఊరు వాళ్ళు తప్ప సుమారుగా అందరు పార్వతీపురంలో ఉన్న ఉద్యోగస్తుల పిల్లలే. నాలో ఒక విధమైన ఆత్మన్యూనత ఉండేది. నిజానికి నేను బాగా చదువుతాను అన్న ఒక్క కారణంతో పార్వతీపురంల్లో పెట్టారు. లేదంటే మా ఊరు పక్కనే ఉన్న నాగూరు ప్రాథమికోన్నత పాఠశాల చాల మంచిదే. కాకపొతే ఒక మైలు దూరం నడిచి వెళ్ళాలి.

ఒకసారి కావ్యపఠనం లో పోటీలు జరిగాయి. “ఆవు పులి” పాఠంలోని పద్యాలు తప్పుల్లేకుండా స్పష్టంగా చెప్పాలి అన్నారు తెలుగు మాష్టారు. తొలిసారి ఊరు నుండి పార్వతీపురం వచ్చాను. అందరి ముందు నిలబడాలి అంటేనే కాళ్ళు వణికే రోజులు. కానీ పద్యాలు చదవటమంటే నేను ఏవిధంగానూ వదులుకోలేని అవకాశం. ఊర్లోను, చుట్టుపక్కల తరచుగా నాటక ప్రదర్శన జరుగుతున్న రోజులవి. ఆ పద్యాల కోసం ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను. తరువాత ఎడ్లు మేతకు తోలుతూ ఆ పద్యాల్లో కొన్ని ముక్కలు పాడుకునే వాడిని. అంతే కాదు. “నీ గొంతు బాగుంటుంది” అంటూ విజయ్, వరప్రసాద్ ధైర్యం చెప్పేవాళ్ళు. యు వి వి ఎస్ ఎస్ ఆర్ వర ప్రసాద్ తహసీల్దారు గారి అబ్బాయి. విజయ్ వాళ్ళ నాన్న కూడా పెద్ద ఉద్యోగస్తుడే. నేను ఊరి నుండి వచ్చినా పార్వతీపురంలో ఉండిపోయే వాడిని. సాయంకాలాలు బంగళాలో గుడ్డ బంతి తో క్రికెట్ ఆడటం అక్కడే మొదలటయ్యింది. పద్యం పట్ల నాకున్న మమకారమో, వీళ్ళు చెప్పినందుకు వచ్చిన ధైర్యమో లేదా రెండు కలసి వచ్చిన సమయమో చెప్పలేను కానీ, లేచి నిల్చుని మొత్తం పద్యాలు చదివాను. తరువాత సెలవులు వచ్చాయి.

నేను ఊర్లో న్నప్పుడు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బహుమతి ప్రధాన కార్యక్రమం జరిగింది. “కావ్య పఠన” లో నా పేరు చదివి ప్రథమ పురాస్కారం అని చెప్పగానే నా తరపున వర ప్రసాద్ వెళ్లి ఆ బహుమతి అందుకున్నాడు. ఆ విధంగా మా పార్వతీపురంలో వేదిక ఎక్కి బహుమతి తీసుకునే అవకాశం కోల్పోయాను. అయితే బహుమతి నా చేతుల్లోకి చేరక ముందే పార్వతీపురంలో ఎన్నో ఇల్లు చేరింది. ఎందరినో అలరించింది. ఎన్నో నోళ్ళ నా పేరు పలికించింది. నేను చూడని, నేను మాట్లాడని ఎందరో పరోక్షంగా నన్ను దీవించే స్థితికి తీసుకు వచ్చింది. నేను స్కూలుకు వెళ్ళాక వర ప్రసాద్ అన్నాడు “ఇది నీకు వచ్చిన బహుమతి. మా ఇంట్లో అందరూ చదివేసారు. మన క్లాసుమేట్స్ తల్లిదండ్రులు చాల మంది చదివారు. మెచ్చుకున్నారు. ఈ పుస్తకాన్ని. నిన్ను కూడా”

పుస్తకాన్ని రెండు చేతుల్లోకి తీసుకున్నాను. మామూలు పుస్తకాల కంటే భిన్నంగా డెమి సైజు లో ఉంది. చేతుల్లో నిండుగా ఉంది. రంగు రంగుల ముఖ చిత్రం. సీతారామలక్ష్మణులు, భరత శత్రుఘ్నులు. అదే కుటుంబంలో భాగంగా మారిపోయిన రామబంటు హనుమంతుడు. పైన పెద్దవి గుండ్రనివి అయిన అక్షరాలు. “బాలల బొమ్మల రామాయణం”. అన్ని చేతులు మారినా ఇంకా కొత్త పుస్తకానికి ఉన్న పరిమళం వీడ లేదు. వెంటనే గుండెలకు హత్తుకున్నాను. జీవితంలో తొలిసారి వచ్చిన బహుమతి. ఒక్కొక్క పేజీ చూస్తూ ఉంటే చదవక్కర లేకుండానే అర్ధమయ్యే అందమైన నలుపు తెలుపుల బొమ్మలు. వాటి కింద ఆకర్షణీయమైన కాప్షన్స్. గుండ్రని పెద్ద అక్షరాల్లో చదవటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్న కథ.

నేను పూర్తిగా చదివిన తరువాత అందరికీ వినిపించే కార్యక్రమం మొదలు పెట్టాను. చుట్టు పక్కల ఉన్న అత్తలు, పెద్దమ్మలు, పిన్నమ్మలు అందరూ రాత్రి భోజనాల తరువాత మా ఇంటి కిరోసిన్ దీపం చుట్టూ చేరిపోయేవారు. రోజుకో కాండ చొప్పున్న చదివి వినిపించాను. వ్యాఖ్య అవసరం లేని కథనం. అందరికీ అతి సులభంగా అర్ధమయ్యే భాష.

ఈ బాలల బొమ్మల రామాయణం నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. రామాయణంలో రాముడు ఒక్కడే దేవుడు అని అంతకు ముందు అనుకునే వాడిని. కానీ ఈ పుస్తకం చదివాక రామాయణంలో ఎందరో దేవుళ్ళు, దేవతలు కనిపించారు. నిజానికి దేవలోకం మారువేషాల్లో నేల మీద వాలి ఉంటుంది అనిపించింది. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టగానే వారి అందచందాలు, రూపురేఖలు అయోధ్య మొత్తం చేరవేసిన దాసీజనం తొలిసారి కనిపించిన వైతాళికులు. ఉయ్యాల్లో వేసినప్పుడు సూర్య వంశపు రాజులను కీర్తిస్తూ జోలపాటలు పాడిన ముగ్గురమ్మలు మాతృత్వాన్ని, అయోధ్య రాజ్య వైభవాన్ని మన వరకు చేరవేసిన మాతృ దేవతలు. రాక్షస మూకల నుండి ఋషులను రక్షించటానికి తనతో తీసుకెళ్లి విలువిద్యలో ఎంతో ప్రావీణ్యం ప్రసాదించిన విశ్వామిత్రుడు గురు దేవుడు. నాగేటి చాలులో దొరికిన ఆడ పిల్లను పెంచి పెద్ద చేసి స్వయంవరం ప్రకటించి రాముడికిచ్చి పెళ్లి జరిపించిన జనకుడు పితృ దేవుడు. శాపాలన్నీ తనమీద వేసుకుని కేవలం రెండు వరాలు అడిగి రాముడ్ని అరణ్యానికి పంపిన కైకేయి, లోపల దాచుకుని శిలలా మారిపోయిన మరో కారణం జన్మురాలు. రాముడు వనవాసానికి బయలుదేరుతుంటే కన్నీరు మున్నీరు అయిన అయోధ్య జనం అభిమాన దేవుళ్ళు. తనతో బయలు దేరిన సీత అర్థనారీశ్వరి. తనను విడిచి పెట్టలేని లక్ష్మణుడు ఆదర్శ సోదరుడు. భర్తను విడిచి పెట్టి బ్రతకలేని కొత్త పెళ్లి కూతురు ఊర్మిళ పద్నాలుగు సంవత్సరాలు నిద్రలో ఉంది. అన్న పాదుకలు నెత్తిన పెట్టుకుని రాజ్యాన్ని కాపలా కాసిన భరతుడు తపస్వి.

సీతారామ లక్ష్మణులను తన పడవలో గంగను దాటించిన గుహుడు అంటే నాకు చాల ఇష్టం. ఈ పుస్తకం చదివిన తరువాత ఎన్నోరోజులు ఈ దృశ్యాన్ని మరచిపోలేక పోయాను. సంసార సాగరాన్ని దాటించే భగవంతుడు ఈ చిన్న పడవలో ఎక్కి నదిని దాటవలసి రావటం వలన గుహుడి జీవితం పావనం అయ్యింది. తరువాత అరణ్యంలో అత్రి అనసూయలు ఆశ్రమానికి వెళ్ళినప్పుడు శ్రీరాముడి జన్మకారణాన్ని గుర్తించిన అత్రి సకల మర్యాదలు చేసి ఆనందంతో కళ్ళు తడి చేసుకుంటాడు. అనసూయ సీతమ్మను లోపలి తీసుకెళ్లి కొత్త ఇల్లాలి బాధ్యతలు గుర్తు చేస్తుంది. విష్ణుమూర్తి నేలపై నడచి వస్తూ ఈ అడవిలో తిరుగుతున్నాడని తెలుసుకుని శరభంగుడు రాముడు వచ్చే వరకు ఆగి తరువాత తన ఊపిరి ఆపుకుంటాడు. లోక కళ్యాణం కోసం తపస్సు చేస్తూ రాముడు వచ్చేటప్పటికి ఆస్థి పంజరాలుగా పడి ఉన్న వందలు వేల ఋషులు చేసిన త్యాగం రామాయణానికి బీజాక్షరంగా నిలిచింది. .

సీతను ఎత్తుకుపోతున్న రావణుణ్ణి ప్రాణం పోయేవరకు ఎదిరించిన జటాయువు మనోవేదన రాముడు మాత్రమే గ్రహించగలడు. అలసి పోయిన రాముడికి తన నోటితో కొరికి ఎంగిలి చేసి, రుచి చూసిన పళ్ళను తినిపించిన శబరి ఒక ప్రేమ దేవత. హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు లాంటి అందరినీ పనిలో పెట్టి సీతమ్మను వెతికే కార్యక్రమం చేపట్టిన సుగ్రీవుడు ధన్యుడు. దేవతలు మనుషులుగా తిరుగుతున్న అడవిలో అన్య జీవులు కూడా తమ సహాయాన్నిఅందించటం ఈ రామాయణంలో ముఖ్య ఘట్టం.

సముద్రాన్ని దాటి లంకలో అశోకవనంలో ఉన్న సీతమ్మను చూసి అంగుళీకం ఇచ్చి లంకా దహనం చేసి వచ్చిన హనుమంతుడు నిరాశలో మునిగి ఉన్న రాముడికి తొలి ఆశగా నిలిచాడు. రాక్షసుల్లో ఉత్తమురాలయిన త్రిజట, మహా పతివ్రత అయిన మండోదరి అందరూ మానసికంగా సీతా క్షేమం కోరుకున్న వారే. లంకపై యుద్హానికి సేతువు కట్టేందుకు వానర సేన కృషి చేస్తున్నప్పుడు, తన వంతుగా సహాయం చేసిన ఉడుత కూడా రాముని చేతి స్పర్శ తగిలి ఈ పుస్తకంలో చోటు సంపాదించింది. యుద్ధ రంగంలో లక్ష్మణుడు మూర్ఛ పోయినప్పుడు సంజీవని కోసం వెళ్లి అన్ని చెట్లు ఒకేలా ఉన్నాయి అని పర్వతాన్నే మోసుకొచ్చిన ఘనుడు హనుమంతుడు. ఇలా ఎందరో అయోధ్య నుండి లంక వరకు నడిచిన రాముడికి దారి పొడవునా నేలను చదును చేశారు. చీకట్లో వెలుగు చూపారు. ఆకలికి, దాహానికి అంది వచ్చారు.

దేవుడు మనిషిగా పుట్టి మనిషి నడవడికను చెప్పిన కావ్యం ఇది. అడుగడుగా ఆదర్శం కనిపించే ఈ రామాయణం మానవ చరిత్రలో విలువలకు అత్యున్నత పీఠం వేసింది. అడవులు, జింకలు, జటాయువులు, వానరులు, ఉడతలు కూడా ముఖ్య భూమిక పోషించిన రామాయణం చిరస్మరణీయం. నాలుగు యుగాలు పూర్తి కావస్తున్నా ఈ లోకం ఇలా ముందుకు నడవటానికి ముఖ్య కారణం ఇంకా మిగిలి ఉన్న త్రేతాయుగపు కొన్ని విలువలే. రామాయణం నేర్పిన నడతనే.

అందుకే ఇప్పటికీ ఈ దారి పొడవునా రాముడి పాద ముద్రలు లేని చోటు కనిపించదు. ఇదిగో ఇక్కడే రాముడు తిరిగాడు, ఇదిగో ఇక్కడే సీతమ్మ మొక్కలు పెంచింది అంటూ ఎక్కడికి వెళ్లినా జనం మైమరచి చెప్పుకునేటంతగా రాముడు ఈ భరత ఖండాన్ని ప్రభావితం చేసాడు. దాటిన ప్రతి నది సాక్ష్యంగా ఉంది. ప్రతి గట్టున ఒక పడవ సిద్ధం చేసి ఉంది. “సీతా” అంటూ గట్టిగా అరచి రోదించిన ప్రతి కొండ ప్రతిధ్వనులు ఇప్పటికీ విపిస్తుంటాయి. ప్రతి అడవి రాముడి పాద స్పర్శ కోసం ఎదురు చూస్తుంది. ప్రతి పల్లెలో దేవుడై నిలిచిన హనుమంతుడు ఈ దారి పొడవునా ప్రతి అడవిలో రాముడికోసం ఇంకా ఎదురు చూస్తున్నాడు. తన పాద ధూళి తాకిన రాళ్లు ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఎందరో లక్ష్మణులు, భరతులు ఇంకా ఈ దేశంలో మిగిలే ఉన్నారు. ఎన్ని యుగాలు మారినా ఈ దేశాన్ని ఆవహించిన రామాయణం వీడిపోదు. ఎందుకంటే
“శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే ..
సహస్ర నామ తత్తుల్యం ..
రామ నామ వరాననే “

అన్న మహా శివుడి మాటలు ఇప్పటికీ ఈ దేశమంతా ప్రతిధ్వనిస్తున్నాయి. లోక కళ్యాణం కోసం ఆ మహా విష్ణువు ఎన్ని అవతారాలు ఎత్తినా. ఈ లోకాన్ని రక్షించే మహాశివుడికి అతి ఇష్టమైన రాముడు నిత్యం. రామాయణం సత్యం. కాదని ఎవరైనా అంటే గుండె చీల్చి చూపించగల రామబంటు హనుమంతుడు సిద్ధం.

UNQUOTE