దశావతారాలు ఎన్ని?



పైది చొప్పదంటు ప్రశ్న లా అనిపిస్తే, నా తప్పు కాదు!

ప్రపంచంలోని ఈ భూభాగం (అంటే భారత్) తో మీకు ఏమాత్రమైనా అనుబంధం ఉంటే, ఎప్పుడో ఒకప్పుడు మీ మనస్సులో ఈ ప్రశ్న తలెత్తడం సహజం. నేను కూడా మినహాయింపు కాదు.

ఐతే?

అయితే, నేను కూడా ఈ తరానికే చెందినవాడిని కాబట్టి పై ప్రశ్నకి సరైన సమాధానం తెలుసుకోవాలని ఎప్పుడూ శ్రమపడలేదు. దానికి కారణం, అందరి లాగే నేను కూడా ‘పురాణాలు ఎలాగూ పిట్టా, పిల్లీ కథలు’ అనే ఆలోచన కలిగి ఉండడమే ఫ్యాషన్ అనీ, అదే అసలైన మేధావితనం అనీ అనుకోవడం కావచ్చు. అందువల్ల ‘పురాణాలకి సంబంధించిన సత్యాన్ని పరిశోధించాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు’ అని ఒకరకమైన నిర్లక్ష్యం. నిజానికి, నాకు నేనే సమాధానం చెప్పకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారీ, నాకు ఎనిమిది నుండి డజనుకు పైగా అవతారాలను లెక్కకి వచ్చేవి. చివరికి లెక్క తేలక వదిలి పెట్టేశాను. ఫలితం ఏమిటంటే, నేను ఎక్కడికి వెళ్లినా ఈ దశావతారాల చిత్రాలు నన్ను వెంటాడాయి, ఒక్కొక్కసారి ఒక్కో అవతారం తక్కువ (miss) అయినట్టు ఏదో వెలితి.

నాకేంటి?

దశావతారాలు ఉహాచిత్రాలే అనుకున్నా, అనుకోకపోయినా అవి నా సంస్కృతిలో ఒక ముఖ్య భాగం అని మాత్రం గుర్తించగలను. కాబట్టి, భవిష్యత్తులో ఎప్పుడైనా నా సంతానం (లేదా వారి సంతానం) నుండి ఈ ప్రశ్న ఎదుర్కొని, ‘నాకు తెలియదు’ అని చెప్పే బదులు, నాకు నేనుగా సమాధానం వెతకడం ప్రారంభించాను.

కష్టం ఏముంది?

ఇంటర్నెట్ యుగం భారతీయ సంస్కృతికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రక్రియను మరింత కష్టతరం చేసింది. లేదు- లేదు! నేను వికీపీడియా గురించి మాత్రమే మాట్లాడటం లేదు. నా ఉద్దేశ్యం, ‘డేటా’ (data) అని పిలువబడే ‘చెత్త’ (garbage) నుండి అవలీలగా కంటెంట్‌ (content) ను రూపొందించే వెబ్‌సైట్‌లతో సహా తప్పుడు సమాచారంతో వ్రాయబడిన పుస్తకాలూ, నిర్మించబడిన ప్రతి వికీనీ (wiki) దృష్టిలో ఉంచుకుని చెపుతున్నాను. దీనికి తోడు సోహల్ మీడియా ఒకటి ఉంది.

సమస్య ఏమిటి?

ఇప్పుడు నాకు వచ్చిన మొదటి సమస్య ఏమిటంటే, ‘ఈ పోస్ట్ యొక్క శీర్షిక (heading) కు సరైన ప్రశ్న ఏది అయితే బాగుంటుంది?’ ‘దశ’ అనేది సంస్కృతం ధాతు (మూల పదం) నుండి వచ్చింది అనీ; దాని అర్థం ‘పది’ అని కూడా తెలియని వ్యక్తికి మాత్రమే కాకుండా గణన గురించి నాలాగే గందరగోళం ఉన్న వారికి కూడా సముచితంగా అనిపించేలా ‘దశావతారాలు ఎన్ని?’ అన్న ఈ ప్రశ్నని ఎంచుకున్నాను.

సరే, పదం లో మొదటి భాగం (దశ) ఇప్పటికే అనుకోకుండా స్పష్టం చేయబడినందున, ప్రశ్నలోని కీలక పదం లోని రెండవ భాగం ‘అవతారం’ కి వెళ్దాం. మానవులకు, జంతువులకు వేరే ఇతర జీవులకు జన్మ అనే పదాన్ని ఉపయోగిస్తారు. కానీ పరమాత్మ స్వయంగా ఈ భూమిపై కనిపించాలని నిర్ణయించుకున్నప్పుడు, దానిని అవతరణం (పై నుండి దిగడం) అంటారు. దేవుడు ఉన్నాడా? లేడా? ఉంటే మానవ లేదా జంతువుల రూపాలను ధరిస్తాడా అనేది ఇక్కడ ప్రశ్న కాదు. బహుశా మనం ఆ ప్రశ్నను మరొకసారి చర్చించుకోవచ్చు.

ఏది ప్రామాణికం?

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ‘సరైన సమాధానాల కోసం వెతకడానికి మూలం ఏది?’ ‘అందులోనూ ప్రామాణికమైనది ఏది?’ దశావతారాల వర్ణన పురాణాల నుండి వచ్చింది కాబట్టి, శ్రీమద్భాగవతం ఏమి చెబుతుందో చూద్దాం. హరి అవతారలు తెలుసుకోవడానికి శ్రీమద్భాగవతం కాకుండా వేరే ఏ ‘హరికథ’ ప్రమాణం కాగలదు?

కొంత నేపథ్యం

ఇటువంటి విషయజ్ఞానం బొత్తిగా లేని వారికి కోసం ఇక్కడ కొంత నేపథ్యం అవసరం. శ్రీమద్భాగవతం అష్టదశ (౧౮) 18 మహా పురాణాలలో ఒకటి. ఈ మహా పురాణాలు ఇంకా అదనంగా మరో (౧౮) 18 ఉప పురాణాలు వ్యాస భగవాన్ (వ్యాస మహర్షి) చే గ్రంధీకరించ బడ్డాయి. అందువల్ల మన పని ఒకరకంగా సులభం అయ్యింది. శ్రీమహావిష్ణువు అవతారాల గురించి ధృవీకరణ కోసం మనం అన్ని పురాణాలూ వెతకనక్కరలేదు. ఎందుకంటే అవన్నీ ఒకే ఋషి ద్వారా అందించబడ్డాయి.

వ్యాస భగవానుడు (బాదరాయణ మహర్షి) శ్రీమహాభారతాన్ని కూడా రచించాడు. ఇందులో సనాతనీయులకు సర్వోత్కృష్టమైన శ్రీమద్భగవద్గీత ఉంది. శ్రీమత్ భగవద్గీత స్వయంగా శ్రీ కృష్ణ భగవానుని నోటి నుండే వచ్చింది అని కదా చెప్పబడింది. ఇవికాకుండా వ్యాసుడు బ్రహ్మసూత్రాలను కూడా రచించాడు. ఈ గ్రంధం ‘బ్రహ్మం లేదా ఆత్మ’ మాత్రమే వాస్తవమని, మిగతావన్నీ కాదని నిర్ధారించడానికి వ్రాయబడ్డ చర్చల సంగ్రహం లాంటిది. మరి బ్రహ్మసూత్రాలను వ్రాసిన ఋషే పురాణాలను కూడా ఎందుకు రాశారో అని ఆశ్చర్యం కలగడం సబబే. ఎందుకంటే, ప్రాచీన ఋషులు అధికార భేదాన్ని (వివిధ స్థాయి సామర్థ్యం కలిగిన వ్యక్తులను) గుర్తించారు. వేదాంగాల (వేదాలకు అంతర్గతంగా ఉండే సహాయక అవయవాల) లోని నిరుక్తం (వ్యుత్పత్తి శాస్త్రం) (science of etymology) వాస్తవికత (reality) యొక్క అవగాహన ని మూడు వేర్వేరు స్థాయిలలో ఉందని సూచిస్తుంది. (1) ఆదిదైవిక (primordial) (2) ఆదిభౌతిక (physical) (3) ఆధ్యాత్మిక (spiritual). వీటి గురించి మనం వేరే సమయంలో వివరంగా మాట్లాడుకోవచ్చు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, వ్యాసుని ఈ విభిన్న రచనలు వేర్వేరు వర్గానికి వేర్వేరు స్థాయిలలో అందుకునే వారి లక్ష్యాన్ని / అధికారాన్ని బట్టి అందించబడ్డాయి.


విచారణ పరిధి?

ఇప్పుడు లేయర్డ్ (layered) బోధనా విధానాన్ని అర్థం చేసుకున్న తరువాత, విచారణ కోసం మన పరిధి శ్రీ మహా విష్ణువు యొక్క అన్ని అవతారాలు ఏమిటో తెలుసుకోవడానికే పరిమితం చేయబడింది అని గ్రహిద్దాం. శ్రీమద్భాగవతంలోని 1వ స్కందం – 3వ అధ్యాయంలో మనకు కావలసిన అన్ని వివరాలను మనం ఇప్పుడు చూద్దాం. మీరు అన్ని సంబంధిత శ్లోకాలను చివరలో చూడవచ్చు. మూలశ్లోకం సంఖ్య బ్రాకెట్ (bracket) లలో ఇవ్వబడింది.

హెచ్చరిక: శ్రీ మహా విష్ణువు యొక్క అవతారాలు లెక్కలేనన్ని ఉన్నాయని వ్యాస భగవానుడు హెచ్చరించాడు. పైగా గణించడానికి ప్రయత్నించడం అనేది శాశ్వత నీటి-తటాకనికి నీటిని అందించే ప్రవాహాల సంఖ్యను లెక్కించడం లాంటిది అని కూడా అన్నాడు. (1.3.26).


తీర్పు ఏమిటి?

(1) ముందుగా, శ్రీ మహా విష్ణువు యొక్క విరాట్ లేదా పురుష రూపాన్ని, నాశనం చేయలేని బీజంగా పరిగణించండి. ఇది అన్ని జీవులకు రూపాన్ని ఇస్తుంది (1.3.5)

(2) మొదటిది, బ్రహ్మా (అతని నలుగురు కుమారులు సనక, సనందన మొదలగువారు) (1.3.6)

(3) రెండవది, వరాహ (1.3.7)

(4) మూడవది, దేవర్షి నారదుడు (1.3.8)

(5) నాల్గవది, (ఎ) నర (బి) నారాయణ (రాజా ధర్మ యొక్క కవల కుమారులు) (1.3.9)

(6) ఐదవది, కపిల మహర్షి (శాంఖ్యను స్థాపించినవాడు) (1.3.10)

(7) ఆరవది, దత్తాత్రేయ (అత్రి మహర్షి మరియు అనసూయ దేవిలకు జన్మించాడు) (అలర్క, ప్రహ్లాదుడు, యదువు, హైహయ మరియు ఇతరులకు ఆధ్యాత్మికతను బోధించాడు) (1.3.11)

(8) ఏడవది, రాజు యజ్ఞ (స్వయంభువ మన్వంతరం సమయంలో ప్రజాపతి రుచి మరియు ఆకూతికి జన్మించాడు) (1.3.12)

(9) ఎనిమిదవది, ఋషభదేవుడు (మహారాజు నాభి మరియు మేరుదేవికి జన్మించాడు) (1.3.13)

(10) తొమ్మిదవది, పృధు మహారాజు (వ్యవసాయం మరియు ఔషధ మొక్కల సాగును ప్రచారం లోకి తీసుకు వచ్చారు. తల్లి భూమికి అతని నుండే పృధ్వి అనే రెండవ పేరు వచ్చింది). (1.3.14)


మైలురాయి: వైవస్వత మన్వంతర – మునుపటి (చక్షుష) మన్వంతర అనంతరం ప్రస్తుత మనువు కాలం మొదలవుతుంది.

(11) పదవది, మత్స్య (1.3.15)

(12) పదకొండవది, కూర్మ (1.3.16)

(13) పన్నెండవది, ధన్వంతరి (సముద్ర మథనం సంఘటన సమయంలో) (1.3.17)

(14) పదమూడవది, మోహిని (అదే సముద్ర మథనం సంఘటన సమయంలో ధన్వంతరితో పాటు) (1.3.17)

(15) పద్నాలుగవది, నరసింహ (1.3.18)

(16) పదిహేనవది, వామన (1.3.19)

(17) పదహారవది, పరశురామ (1.3.20)

(18) పదిహేడవది, వ్యాస (పరాశరుడు మరియు సత్యవతికి జన్మించాడు) (1.3.21)

(19) పద్దెనిమిదవది, రామ (1.3.22)

(20) పంతొమ్మిదవది, (ఎ) శ్రీ కృష్ణ మరియు (బి) బలరామ (1.3.23)


మైలురాయి: సూత ముని ఈ శ్లోకాలన్నింటిని ప్రస్తావిస్తూ భవిష్యత్ అవతారాల గురించి ముందే చెబుతున్నాడు.

(21) ఇరవయ్యవది, బుద్ధుడు (ఆస్తికులను ద్వేషించే అసురులను మోహింపజేయడానికి) (1.3.24)

(22) ఇరవైయ్యొకటవది, కల్కి.

ఇప్పుడు ప్రధాన అవతారాలను మీరే లెక్కచూడండి.

కథలో నీతి?

(1) ఏదైనా ఒకపక్క చాలా స్పష్టంగా, ఇంకోపక్క గందరగోళంగా ఉంటే, విచారించి, మీకు మీరే కనుగొనండి. (2) వికీపీడియా లేదా కోరా (quora) పై ఎక్కువగా ఆధారపడకండి, సరైన అధారం లేదా గ్రంథాన్ని కనుగొనండి. (3) సమర్ధుడైన గురువుకు ప్రత్యమ్నాయం లేదని గుర్తుంచుకోండి.

ఆనందంగా అన్వేషణ కొనసాగించండి!

చిత్ర సౌజన్యం: మంజు సత్తిరాజు
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం


మూలం

శ్రీమద్భాగవతం – ౧ (1) వ స్కందం – ౩ (3) వ అధ్యాయం

ఏతన్నానావతారాణాం నిధానం బీజమవ్యయం ।
యస్యాంశాంశేన సృజ్యంతే దేవతిర్యఙ్నరాదయః ॥ ౧.౩.౫॥

స ఏవ ప్రథమం దేవః కౌమారం సర్గమాశ్రితః ।
చచార దుశ్చరం బ్రహ్మా బ్రహ్మచర్యమఖండితం ॥ ౧.౩.౬॥

ద్వితీయం తు భవాయాస్య రసాతలగతాం మహీం ।
ఉద్ధరిష్యన్నుపాదత్త యజ్ఞేశః సౌకరం వపుః ॥ ౧.౩.౭॥

తృతీయం ఋషిసర్గం చ దేవర్షిత్వముపేత్య సః ।
తంత్రం సాత్వతమాచష్ట నైష్కర్మ్యం కర్మణాం యతః ॥ ౧.౩.౮॥

తుర్యే ధర్మకలాసర్గే నరనారాయణావృషీ ।
భూత్వాఽఽత్మోపశమోపేతమకరోద్దుశ్చరం తపః ॥ ౧.౩.౯॥

పంచమః కపిలో నామ సిద్ధేశః కాలవిప్లుతం ।
ప్రోవాచాసురయే సాంఖ్యం తత్త్వగ్రామవినిర్ణయం ॥ ౧.౩.౧౦॥

షష్ఠమత్రేరపత్యత్వం వృతః ప్రాప్తోఽనసూయయా ।
ఆన్వీక్షికీమలర్కాయ ప్రహ్లాదాదిభ్య ఊచివాన్ ॥ ౧.౩.౧౧॥

తతః సప్తమ ఆకూత్యాం రుచేర్యజ్ఞోఽభ్యజాయత ।
స యామాద్యైః సురగణైరపాత్స్వాయంభువాంతరం ॥ ౧.౩.౧౨॥

అష్టమే మేరుదేవ్యాం తు నాభేర్జాత ఉరుక్రమః ।
దర్శయన్ వర్త్మ ధీరాణాం సర్వాశ్రమనమస్కృతం ॥ ౧.౩.౧౩॥

ఋషిభిర్యాచితో భేజే నవమం పార్థివం వపుః ।
దుగ్ధేమామోషధీర్విప్రాస్తేనాయం స ఉశత్తమః ॥ ౧.౩.౧౪॥

రూపం స జగృహే మాత్స్యం చాక్షుషోదధిసంప్లవే ।
నావ్యారోప్య మహీమయ్యామపాద్వైవస్వతం మనుం ॥ ౧.౩.౧౫॥

సురాసురాణాముదధిం మథ్నతాం మందరాచలం ।
దధ్రే కమఠరూపేణ పృష్ఠ ఏకాదశే విభుః ॥ ౧.౩.౧౬॥

ధాన్వంతరం ద్వాదశమం త్రయోదశమమేవ చ ।
అపాయయత్సురానన్యాన్ మోహిన్యా మోహయన్ స్త్రియా ॥ ౧.౩.౧౭॥

చతుర్దశం నారసింహం బిభ్రద్దైత్యేంద్రమూర్జితం ।
దదార కరజైర్వక్షస్యేరకాం కటకృద్యథా ॥ ౧.౩.౧౮॥

పంచదశం వామనకం కృత్వాగాదధ్వరం బలేః ।
పదత్రయం యాచమానః ప్రత్యాదిత్సుస్త్రివిష్టపం ॥ ౧.౩.౧౯॥

అవతారే షోడశమే పశ్యన్ బ్రహ్మద్రుహో నృపాన్ ।
త్రిఃసప్తకృత్వః కుపితో నిఃక్షత్రామకరోన్మహీం ॥ ౧.౩.౨౦॥

తతః సప్తదశే జాతః సత్యవత్యాం పరాశరాత్ ।
చక్రే వేదతరోః శాఖా దృష్ట్వా పుంసోఽల్పమేధసః ॥ ౧.౩.౨౧॥

నరదేవత్వమాపన్నః సురకార్యచికీర్షయా ।
సముద్రనిగ్రహాదీని చక్రే వీర్యాణ్యతః పరం ॥ ౧.౩.౨౨॥

ఏకోనవింశే వింశతిమే వృష్ణిషు ప్రాప్య జన్మనీ ।
రామకృష్ణావితి భువో భగవానహరద్భరం ॥ ౧.౩.౨౩॥

తతః కలౌ సంప్రవృత్తే సమ్మోహాయ సురద్విషాం ।
బుద్ధో నామ్నాజనసుతః కీకటేషు భవిష్యతి ॥ ౧.౩.౨౪॥

అథాసౌ యుగసంధ్యాయాం దస్యుప్రాయేషు రాజసు ।
జనితా విష్ణుయశసో నామ్నా కల్కిర్జగత్పతిః ॥ ౧.౩.౨౫॥

అవతారా హ్యసంఖ్యేయా హరేః సత్త్వనిధేర్ద్విజాః ।
యథావిదాసినః కుల్యాః సరసః స్యుః సహస్రశః ॥ ౧.౩.౨౬॥