లంచం

హెచ్చరిక: లంచం ఇవ్వడం గానీ తీసుకోవడం గానీ చట్టరీత్యా నేరం.


అప్పుడు నాకు పన్నెండేళ్ళు ఉంటాయేమో. మేము కాకినాడలో ఉన్నాం.

‘జై ఆంధ్రా’ ఉద్యమం నడుస్తోంది. ఆ సంవత్సరం మొత్తం మీద ఆరు నెలలైనా సరిగ్గా స్కూళ్ళు (schools) / క్లాసులు (classes) జరిగి ఉండవు. ఎప్పుడూ ఏవో సమ్మెలూ, ఆందోళనలు. ఏం జరిగినా స్కూళ్ళకి శలవులు. మొదట్లో ఆ శలవులు బాగానే అనిపించాయి. రాను రాను బోరు (bore) కొట్టడం మొదలైంది.

ఎప్పుడూ ఇంటి చుట్టుపక్కలే ఆడుకోవడం. అమ్మ పిలిచినప్పుడు ఇంటికి వచ్చేయ్యడం. ఇదే రొటీను (routine).

ఈ ఆగష్టు పదిహేనున జగన్నాథపురం బ్రిడ్జి (bridge) దగ్గర మోటార్ బోట్ (motor boat) ఎక్కడానికి నా ఫ్రెండ్స్ (friends) “పట్నాల”, “అచారి” వెళ్తున్నారు. (ఇంటిపేర్లతో పిలుచుకోవడం అప్పట్లో మామూలే). వాళ్ళతో ఎలాగైనా కలిసి వెళ్ళాలి. అమ్మని అడిగితే “నాకుతెలియదు బాబాను అడుగు” అంది. తను కూడా బాబాని ఏదో అడగాలిట. “నేనే తటపటాయిస్తున్నారా” అంది. అంటే నా సంగతి అమ్మ ఒప్పుకున్నట్లే అనుకోవాలా?

బాబాను ఒప్పించడం అంత సుళువా? ఏదో ఒకటి చెయ్యలి. (నేను ఇంతకు ముందు చెప్పానో లేదో, “బాబా” అంటే మా నాన్నగారు అన్నమాట).


బాబాకు అవాళ మధ్యాహ్నం డ్యూటీ (duty). (బాబాకి రెండు షిఫ్ట్ (shift) లు ఉండేవి లెండి). అప్పట్లో పోద్దున్నే పూజ చేసుకున్న తరువాత పోతన గారి ఆంధ్ర మహా భాగవతం చదవడం; చదవడం అయి పోయాక “ఏమే” అని ఒక్క కేక పెట్టడం; అమ్మ “సరే” అని కాఫీ (coffee) వేడిచేసి పట్టుకురావడం; ఇలా ప్రారంభం అయ్యేది ఆయన దినచర్య. అసలు ఆయన పూజ, ఆ తరవాత బిగ్గరగా చదివేది మా చెవిన పడాలనా? ఏమో!

ఆరోజు బాబా భాగవతం చదవడం మొదలుపెట్టారో లేదో, “ఈ కాఫీ బాబాకు ఇచ్చి రారా” అని నాకు పురమాయించింది అమ్మ. ‘అమ్మ అడుగుదామనుకున్నదేదో ఇవ్వాళే అడుగుతుంది కాబోలు’ అనుకున్నా బాబకి కాఫీ గ్లాసు అందిస్తూ. “ఆహా” అని కాఫీ అందుకుని, “ఇప్పుడే కరెంటు (current) కూడా పోవాలా?” అన్నారు బాబా. ఫాను (fan) క్రింద కాఫీ తాగితే వచ్చే మజా ఆయనకే తెలుసు. అమ్మకు ఇంకా బాగా తెలుసనుకో!

అప్పుడే నా బుర్రలో ఏదో ఫ్లాష్ (flash) లాగ తళుక్కున మెరిసింది. ఒక్క జంపు (jump) లో నా విసినకర్ర1 ని అందుకున్నా. బాబా కాఫీ తాగుతుంటే విసరడం మొదలుపెట్టా. నా టైమింగ్ (timing) కి లోలోపల నేనే మురిసిపోతున్నా. నా మొహం మీదకు వచ్చిన కన్నింగ్ (cunning) మందహాసం కనిపెట్టే మూడ్ (mood) లో బాబా లేరు. ఆయన కాఫీని ఆస్వాదిస్తున్నారు.

అమ్మ ఎప్పుడు అక్కడికి వచ్చిందో, “వచ్చేనెల మీ చెల్లెలు మద్రాసు నుంచి వస్తోంది. చాలా రోజుల తరవాత మన ఇంటికి వస్తోంది. చీర పెడితే బాగుంటుంది. వీలవుతుందా?” అంది బాబాతో. “వెంకట్రావు క్లాత్ స్టోర్సులో మనకి కావలసింది తీసుకోమన్నాడు. మూడు నాలుగు ఇన్స్టాల్మెంట్స్ (instalments) లో తీర్చ్చెయ్యొచ్చులే” అన్నారు. “మీకు ఎలా చెప్పాలా అని టెన్షన్ (tension) పడ్డాను” అని అక్కడినించి వెళ్లి పోయింది.


“నీ సంగతి ఏంటి రా” అన్నారు నాకేసి తిరిగి. అంత ప్రిపేరు (prepare) అయినా “ఏమి లేదు” అని వచ్చేసింది నా నోట్లోంచి అనాలోచితంగా. “ఫరవాలేదు చెప్పు, ఏదో ఉంది” అన్నారు చిరు మందహాసంతో నా విసినకార్రకేసి చూస్తూ. లంచం ఇస్తూ దోరికిపోయిన ఫీలింగ్ (feeling) తో ఇంకాస్త ముడుచుకు పోయా సిగ్గుతో. బాబా చూడనట్టే ఉంటారు, ఇట్టే పట్టేస్తారు.

ధైర్యం చేసి అడిగా, “ఎల్లుండి ఆగష్టు పదిహేనున మోటారు బోటులో ఫ్రెండ్స్ అందరూ వెళుతున్నారు……” ఇంకా నేను పూర్తి చేయ్యకుండానే “వద్దు!” అనేసారు. “టిక్కెట్టు (ticket) లేదు ఫ్రీ (free) ట ఆగష్టు పదిహేను కదా” అని అంటూ నాలుక కరుచుకున్నానో లేదో “ఫ్రీ (free) అయితే అసలొద్దు!” అని నిష్కర్షగా చెప్పేసి ఆయన భాగవతంలో ములిగి పోయారు. “ఫ్రీ” అన్నందుకో ఏమో ఆయన మొహం ఎర్రగా మారిపోయింది. ఇంక ఆ విషయం మాట్లాడే ధైర్యం నాకు చాలలేదు.


పదిహేనవ తారీఖున పట్నాలా, ఆచారి నన్ను కూడా పంపించమని అమ్మను అడగడానికి ఆఖరి ప్రయత్నం చేసిచూసారు. ఇందులోకి నన్ను లాగవద్దు అని అమ్మ ఖచ్చితంగా చెప్పేసింది. నాకు ఏడుపు ఒకటే తక్కువ. “బై (bye) రా” అని వాళ్ళు వెళ్లి పోయారు బోట్ ట్రిప్ (boat trip) కి.


వెళ్లిన గంటలో పట్నాలా, ఆచారి రొప్పుకుంటూ వచ్చారు. “కూర్చోండిరా, రిప్లై కార్డ్2 (reply card) లాగ తిరుగు-టపా లో వచ్చేసారు. మంచినీళ్ళు తాగుతారా?” అంది అమ్మ. రోజూ వచ్చేవాళ్ళేగా వాళ్ళకి అంత మర్యాద ఎందుకు? నేను వెళ్ళలేదని నాకు కాలిపోతోంది అసలే. అమ్మ మాత్రం ఏదో శంకించింది వాళ్ళ ముఖాలు చూస్తూనే. అమ్మ చేతిలో మంచినీళ్ళ గ్లాసులు తీసుకుంటూనే పెద్దగా ఏడిచేసారు ఇద్దరూ. వాళ్ళు ఎక్కవలసిన బోటు (boat) మిస్స్ (miss) అయ్యరుట. (నావల్ల లేటు (late) అయ్యిందికదా మరి, దానికి కూడా నామీద ఏడుపనుకున్నా పూర్తిగా వాళ్ళ మాటలు వినకుండా).

వాళ్ళు ఎక్కవలసిన బోటు ఓవర్లోడ్ (overload) అయ్యి బోల్తా అయ్యిందిట. ఎంతమంది బతికారో తెలియదంటున్నారు. “ఇవ్వాళ మేము ఇద్దరమూ మీవల్లే బతికున్నాం స్వయంప్రభ గారూ” అంటున్నారు గాని వాళ్ళు దుఃఖంలో ఏమి మాట్లాడుతున్నరో వాళ్ళకే తెలియదు (మా చిన్నప్పుడు ఆంటీ (auntie) అనే పిలుపులు లేవు లెండి).

జరిగిన విషయం నాకు పూర్తిగా అర్ధం కావడానికి కొంత సమయం పట్టింది. వాళ్ళు ఇద్దరు అనుకున్నారు కానీ నిజానికి ఆరోజు సేవ్ (save) అయినది ముగ్గురు. మూడో వ్యక్తి నేను. అదీ బాబా వల్ల. ఇప్పుడు అమ్మ కొత్త ఉపవాసాలు, నైవేద్యాలు మొదలు పెడుతుంది కాబోలు భగవంతునికి థాంక్స్ (thanks) చెప్పుకోవడానికి. ప్రదక్షిణలు చెయ్యడానికి గుడికి నన్ను కూడా రమ్మంటుందో ఏమో దేవుడోయ్!


బాబా సాయంత్రం వచ్చాక ఈ టాపిక్ (topic) రాలేదు. ఆరోజు సంఘటన ఆయనకి తెలియదా? తెలిసే ఉంటుంది, ఊరంతా అదే చర్చ. బాబాకి “థాంక్స్” (thanks) అని చెప్పాలి అనిపించింది కానీ చెప్పలేదు. బాబా మాత్రం “ఏడిశావులేవో, ఈ ఒక్కసారే రక్షించబడ్డట్టు!” అన్నట్టు చూసినట్టనిపించింది ఆ రోజు.


1 తాటాకు విసనకర్ర పాడైతే దాన్ని గన్ (gun) లాగానో మరో విధంగా ఆడుకోవడనికి వాడుకోవచ్చు. అందుకే ఇంటినిండా విసనకర్రలు ఉండేవి గానీ అవసరానికి ఎప్పుడూ కనబడవు. ఒక్కటే విసనకర్ర ఇద్దరు (అంతకన్నా ఎక్కువ) పిల్లలు షేర్ (share) చేస్కోవాలంటే అదో పెద్ద యుద్ధం. మళ్లీ కొనమంటే బాబాతో యుద్ధం. మొదట్లో మా అమ్మ పిల్లల పేర్లు విసనకర్ర మీద పెన్ను(pen) తో రాసి ఇచ్చి, “ప్రోబ్లమ్ సాల్వ్డ్ (problem solved)” అనుకుంది. ఇంట్లో ఉన్నది పిల్లలు కాదు కోతులాయే. పెన్ను(pen) లు అరిగేలా ఎవరిది ఏదో తెలియకుండా కెలికి పారేసేవాళ్ళం ఒకరిది కనబడకపోతే. అందుకే రంగురంగుల జాకెట్ పీస్ (jacket piece) లు విసనకర్రకు అంచులుగా కుట్టి ఇచ్చి ఎవరిది వాళ్ళు జాగ్రత్తగా చూస్కోమనేది. ఇది మా అమ్మ గ్రేట్ ఐడియా (great idea) అనుకునేవాళ్ళం మొదట్లో. ఎవరింట్లో చూసినా ఇదే ట్రెండు (trend) అప్పట్లో.

2 రిప్లై కార్డ్ (reply card) లని జంట పోస్త్ కార్డ్లు (post cards) ఉండేవి (ఇప్పుడూ ఉన్నాయేమో). ఒక కార్డ్ (card) మీద ఉత్తరం రాసి పంపిస్తే, అందుకున్నవాళ్ళు రెండవకార్డు మీద సమాధానం రాసి పోస్ట్ (post) చేసేవారు. ఉత్తరం అందుకున్నవాడు పదిపైసలు కూడా ఖర్చు పెట్టక్కర్లేకుండా పోస్టల్ (Postal) వారు కల్పించిన సువిధా.

చిత్ర సౌజన్యం: అహల్య సత్తిరాజు